హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ ఆది శంకరాచార్యుల వైభవాన్ని ప్రజలకు తెలియ జేయాలనే ఉద్దేశంతో మహత్తర రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలను సందర్శిస్తూ సనాతన ధర్మ సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా వ్యాప్తి చేయనుంది. ఈ యాత్రను ఈ నెల 21వ తేదీన తాడబండ అంజనేయస్వామి దేవాలయంలో ఘనంగా ప్రారంభించనున్నారు. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఐటీ , ఇండస్ట్రీస్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ యాత్రను ప్రారంభించనున్నారు. శ్రీశ్రీశ్రీ 1008 వైరాగ్య శిఖామణి అవధూత గిరి మహారాజ్ వేద స్వస్తితో ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద్ హరి, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అతిథులుగా హాజరవుతారని నిర్వాహకులు, శ్రీ వేదభారతి ట్రస్టీ డాక్టర్ రేమల్లా అవధానులు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం , దేవాదాయ శాఖ సహకారంతో ఈ రథయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు .ఈ యాత్రలో భాగంగా ప్రతి గ్రామంలో శ్రీ శంకర జయంతోత్సవాలు నిర్వహించడం, శంకరాచార్యుల జీవిత చరిత్ర, స్తోత్రాలు, ముఖ్య శ్లోకాలతో కూడిన పుస్తకాలను సుమారు 1 లక్ష మంది విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సుమారు 500 హైస్కూల్‌లలో ఈ పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించార. 108 శ్రీ శంకర విగ్రహాలను దేవాలయాలకు అంద జేస్తామన్నారు. వేద సభలు, శాస్త్ర సభలు, సంస్కృత తరగతులు, విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ ప్రజలు ఈ యాత్రను విజయవంతం చేయాలని, ఆదిశంకరాచార్యుల తత్త్వాలను, జీవన విధానాన్ని, సనాతన ధర్మ సందేశాన్ని గ్రామ గ్రామానికి చేర్చాలని “భారతీయం” సంస్థ నిర్వాహకులు సత్యవాణి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ ఆది శంకరాచార్యుల రథయాత్రకు సంబంధించిన వెబ్‌సైట్ , పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞ భారతీయ సంస్థ నిర్వాహకులు కిష్ణప్రసాద్, జీబీఎస్ శర్మ, సప్తపర్ణి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రకాష్, 108 టీవీ చైర్మన్ జీ. నవీన్ రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మాండభేరి గోపరాజు పాల్గొన్నారు.
