హైదరాబాద్ : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కీ రోల్ పోషించిన చిత్రం రాజా సాబ్. దీనికి యంగ్ డైరెక్టర్ మారుతి ప్రసాద్ దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్స్ కు సంబంధించి ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అసలు విడుదల అవుతుందా లేదా అన్న దానిపై అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా రాజా సాబ్ విడుదల ఆలస్యం అవుతోందన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై సీరియస్ గా స్పందించారు పీపుల్స్ మీడియా అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు . రాజా సాబ్ మూవీపై వస్తున్న ప్రచారాన్ని, పుకార్లను తోసి పుచ్చాడు. ఇది మంచి పద్దతి కాదన్నాడు. దీని వల్ల తమ లాంటి వారిపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు.
రాజాసాబ్ విడుదలకు ఎలాంటి ఢోకా లేదన్నాడు. అంతే కాకుండా సినిమా నిర్మాణం కోసం తీసుకు వచ్చిన డబ్బులను అన్నింటిని క్లియర్ చేశానని చెప్పాడు. ఇక ఇవ్వాల్సింది కేవలం వడ్డీలు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నాడు టీజీ విశ్వ ప్రసాద్. వ్యాపారం ప్రారంభమయ్యే ముందు మిగిలిన వడ్డీ త్వరలోనే క్లియర్ చేస్తానని చెప్పాడు. ఇదే సమయంలో తెలంగాణ సర్కార్ కు కీలక సూచన చేశాడు. సినిమా రిలీజ్ ను ఆపకుండా నిరోధించేందుకు స్పష్టమైన చట్ట పరమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని కోరాడు. దీని వల్ల తమకు ఇబ్బంది తప్పుతుందని స్పష్టం చేశాడు. లేక పోతే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని వాపోయాడు నిర్మాత.


















