తిరుపతి : శ్రీవారి దర్శనార్థం లక్షలాది భక్తులకు నిత్యం విశేష సేవలు అందిస్తున్న టిటిడి ఉద్యోగులు ఎదుర్కొనే మానసిక, పనిఒత్తిడులను క్రీడల ద్వారా సమర్థంగా అధిగమించ వచ్చని టిటిడి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడాపోటీలు సోమవారం తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోని పరేడ్ మైదానంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఈవో, ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు ఉన్నతాధికారులతో కలిసి క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి, బెలూన్లు , శాంతి కపోతాలను ఎగుర వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిటిడి ఉద్యోగులు రోజువారీ జీవితంలో ఏదో ఒక క్రీడను అలవాటు చేసుకుంటే ఒత్తిళ్లను అధిగమించడంతో పాటు మరింత ఉత్సాహంతో, బాధ్యతతో విధులు నిర్వర్తించగలరని తెలిపారు. క్రీడలు జీవితంలో భాగమైతే శారీరక ఆరోగ్యంతో పాటు ఉల్లాసం, సమయ పాలన, ప్రణాళికా దృక్పథం, సానుకూల ఆలోచన, మంచి ప్రవర్తన, క్రమశిక్షణ, కార్యనిర్వహణ నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, సంక్షోభ నిర్వహణ సామర్థ్యం , అందరిని కలుపుకుని ముందుకు సాగే తత్వం అలవడతాయని చెప్పారు.
మన ఆలోచనలకు అనుగుణంగానే మన ప్రవర్తన ఉంటుందని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, మానసిక వికాసం దృష్ట్యా 1977 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది ఉద్యోగుల క్రీడాపోటీలను నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి రోజూ క్రీడల్లో పాల్గొనాలని సూచించారు.
