తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆధునికంగా, నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ స్పష్టం చేశారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ టీటీడీ విద్యాసంస్థల్లో ఆధునిక పద్ధతుల్లో విద్యాబోధనతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలిపారు. ఇందు కోసం టీటీడీ పాలకమండలి రూ.118 కోట్లను కేటాయించిందని చెప్పారు.
పరీక్షల సమయంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, బోధన విధానాలను మెరుగు పరచడం వంటి అంశాలపై ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసులు, మెరుగైన బోధన విధానాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే పరీక్షల సమయంలో పర్యవేక్షణ, విద్యార్థుల భద్రత, వసతి, భోజనం, పోటీ పరీక్షలకు శిక్షణ, ఉపాధి అవకాశాలకు సంబంధించిన కోర్సులు, వైద్య సదుపాయాలు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
నూతన విద్యా విధానాలకు అనుగుణంగా టీటీడీ విద్యాసంస్థల్లో మార్పులు తీసుకు రావడానికి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తూ ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల ప్రతిభను మెరుగు పరచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. అనంతరం విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను జేఈవో పరిశీలించి, విద్యార్థులు మరింత మెరుగ్గా అభ్యసించేందుకు అవసరమైన చార్ట్‌లు, బోధనా సాధనాలు సిద్ధం చేయాలని సూచించారు.

















