ఆదాయ వనరుల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

తిరుప‌తి న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌

hellotelugu-TirupatiMayor

తిరుప‌తి : తిరుప‌తి న‌గ‌రంలో ఆదాయ వ‌న‌రుల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని స్ప‌ష్టం చేశారు న‌గ‌ర మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. 2026-27 సంవ‌త్స‌రానికి సంబంధించి బ‌డ్జెట్ త‌యారీపై గురువారం కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ఆర్ధిక వనరులు సమృద్ధిగా ఉంటేనే సాధ్యం అవుతుందన్నారు. ఆదాయ వనరులు సమకూర్చేటప్పుడు అవకాశం ఉన్న మేరకు ప్రజలపై భారం పడకుండా వనరుల సాధన కోసం ప్రత్యేక ప్రాదాన్యత ఇవ్వాల‌న్నారు. ఇతర నగరాలకు లేని అవకాశం కేవ‌లం తిరుపతి నగరానికి మాత్ర‌మే ఉంద‌న్నారు మేయ‌ర్ డాక్ట‌ర్ శిరీష‌. శ్రీవారి పాదాల చెంత మన నగరం ఉన్నదని గుర్తు పెట్టుకోవాల‌ని అన్నారు. శ్రీవారి భక్తుల రాకపోకలు , టిటిడి సంస్థలు ఉన్న నగరం కాబట్టి టిటిడి సేవలను, అవకాశాలను గరిష్ట స్థాయిలో ఉపయోగించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు డాక్ట‌ర్ శిరీష‌.

కొన్ని పనులు టీటీడీకి అప్పగించడం. మరికొన్ని పనులకు టిటిడిని భాగస్వామ్యం చేసే విధంగా మన ఆలోచనలు ఉండాలని అన్నారు. అప్పుడు నగరం అభివృద్ధి చెందడంతో పాటు నగర పాలక సంస్థపై భారం తగ్గుతుందని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. తిరుపతి నగరానికి ఉన్న ప్రాధాన్యత, ప్రాశస్త్యం వల్ల దేశంలో మన నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదన్నారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగరాల విస్తరణ, అభివృద్ధి పనుల కోసం ప్రవేశ పెట్టే ప్రతి పథకాన్ని తిరుపతికి వర్తించే విధంగా మనం కృషి చేయాలని అన్నారు. గరిష్ఠ స్థాయిలో నిధులు సమకూర్చు కోవాల‌ని సూచించారు డాక్ట‌ర్ శిరీష‌.

Exit mobile version