ముంబై : ఇండియన్ విమెన్ స్టార్ క్రికెటర్ స్మృతీ మంధాన అరుదైన రికార్డు నమోదు చేసింది. తను ప్రస్తుతం భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తోంది. భారత్ సాధించిన పలు విజయాలలో కీలక పాత్ర పోషించింది. పరుగుల వరద పారించింది. ఎలాంటి బౌలర్ నైనా సరే సమర్థవంతంగా ఎదుర్కోవడంతో పాటు కళ్లు చెదిరేలా ఫోర్లు, సిక్సర్లు కొట్టడంతో వరల్డ్ క్రికెట్ లో ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా స్వదేశంలో జరుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా తిరువనంతపురంలో జరిగిన మ్యాచ్ లో తను అరుదైన ఘనత సాధించింది. తన క్రికెట్ కెరీర్ లో 10,000 పరుగులు పూర్తి చేసింది. ఇదిలా ఉండగా పది వేల పరుగులు చేసిన రెండో భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
ఇక వరల్డ్ లో మొత్తం మీద నాల్గవ ప్లేయర్ గా నమోదు చేసింది స్మృతీ మంధాన. భారత ఇన్నింగ్స్ ఏడవ ఓవర్‌లో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మిథాలీ రాజ్, సూజీ బేట్స్ , షార్లెట్ ఎడ్వర్డ్స్ వంటి దిగ్గజాలు ఉన్న జాబితాలో చేరింది, మిథాలీ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణి కావడం విశేషం. మంధాన ఏడు మ్యాచ్‌లలో 57.18 సగటుతో 629 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక వన్డే ఫార్మాట్ లో 117 మ్యాచ్‌లలో 48.38 సగటుతో 5,322 పరుగులు సాధించింది .ఇందులో 14 సెంచరీలు, 34 అర్ధ సెంచరీలు ఉన్నాయి, ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో తను 6వ స్థానంలో ఉంది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మంధాన 157 మ్యాచ్‌లలో 29.94 సగటు, 124.22 స్ట్రైక్ రేట్‌తో 4,102 పరుగులు చేసింది, ఇందులో ఒక సెంచరీ , 32 అర్ధ సెంచరీలు ఉన్నాయి.


















