అమరావతి : ఏపీ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చింది హైకోర్టు. ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గతంలో గ్రూప్ -1 పరీక్షలను నిర్వహించారు. ఫలితాలను కూడా ప్రకటించారు. అయితే పరీక్ష నిర్వహణ, మూల్యాంకనకకు సంబంధించి పలు అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ మేరకు కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. గ్రూప్-1 మూల్యాంకన లోపాలపై 30 రోజుల్లో సిట్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఏమాత్రం ఆలస్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది కోర్టు.
న్యాయమూర్తులు బట్టు దేవానంద్ , అవధానం హరి హరనాథ శర్మలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. గ్రూప్-1 ప్రధాన పరీక్ష (2018) జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన అవకతవకల ఆరోపణలపై విచారణపై సుదీర్ఘంగా వాదోపవాదనలు జరిగాయి. చివరకు నెల రోజుల్లోగా ఒక సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని సిట్ ను ఆదేశించింది. ఇదిలా ఉండగా విచారణ నిమిత్తం సిట్ ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించినప్పటి నుండి చేపట్టిన కార్యకలాపాల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సీఐడీ అదనపు డీజీ సమర్పించగా..కోర్టు పరిశీలించింది.


















