అమరావతి : పారిశ్రామికాభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఏపీలో ఏర్పాటయ్యే పారిశ్రామిక ఎకో సిస్టంను రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులే స్థాపించ గలరనే భావన పోయేలా అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 18వ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ కంపెనీల ఏర్పాటుకు అనుమతులిచ్చారు. మొత్తంగా 50 కంపెనీలకు సంబంధించి రూ. 30,515 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ కంపెనీల ద్వారా మొత్తంగా 29677 ఉద్యోగాలు రానున్నాయి. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. పెద్ద ఎత్తున పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది అని అన్నారు. ఈ అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా పేద, మధ్య తరగతి వారికి ఉద్యోగాలు కల్పించడమే కాదు… సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ మేరకు స్టార్టప్ కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రొత్సాహం అందించాలని అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్టీఐహెచ్ సేవలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఆర్టీఐహెచ్ పరిధిలోని స్టార్టప్ కంపెనీలకు వెంచర్ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలని పేర్కొ్న్నారు సీఎం. ఈ విధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని అన్నారు. దీనికి అనుగుణంగా ఎకో సిస్టం ఏర్పాటు చేసే అంశంపై అధికారులు ఫోకస్ పెట్టాలి.
ఇక వచ్చే పరిశ్రమలకు అనుగుణంగా కరిక్యులమ్ తయారు చేసే దిశగా విద్యా శాఖ ఆలోచన చేయాలి. పరిశ్రమలు, ప్రాజెక్టుల్లో ఎలాంటి ట్రెండ్స్ వస్తున్నాయో గమనించి దానికి అనుగుణంగా కరిక్యులమ్ రూపొందించాలి. రోబోటిక్స్ లాంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా మన విద్యా సంస్థల్లో ఉండాలన్నారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి నాన్ సీరియస్ ప్లేయర్స్ కు ఏపీలో చోటు లేదు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక , వెంటనే పనులు మొదలు పెట్టేలా చూడాలి. పనులు ప్రారంభించని సంస్థలతో టచ్ లో ఉంటూ ఫాలో అప్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
