Silver : దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు వరుసగా రికార్డులు తిరగరాస్తున్నాయి. సోమవారం (సెప్టెంబర్ 30) మరోసారి ఈ రెండు లోహాలు జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. ఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర ఒక్కరోజులోనే రూ.1,500 పెరిగి రూ.1,19,500కు చేరింది. అదే రోజు వెండి ధర కిలోకు రూ.7,000 పెరిగి రూ.1.5 లక్షల గరిష్టాన్ని నమోదు చేసింది. గత వారం రోజుల్లోనే కిలో వెండి (Silver) ధర రూ.19,051 పెరిగినట్టైంది.
Silver – ఈ ఏడాది బంపర్ లాభాలు
2025 ప్రారంభం నుంచి ఇప్పటివరకు మదుపరులకు బంగారం, వెండి (Silver) భారీ లాభాలు చేకూర్చాయి. గత ఏడాది డిసెంబర్ 31న 10 గ్రాముల బంగారం ధర రూ.78,950 ఉండగా, ఇప్పటి వరకు రూ.40,550 పెరిగి రూ.1,19,500కి చేరింది. ఇదే సమయంలో కిలో వెండి రూ.89,700 నుండి రూ.1.5 లక్షలకు చేరి రూ.60,300 పెరిగింది. ఈ ఏడాది స్టాక్ మార్కెట్ సూచీలు పెద్దగా కదలకపోవడంతో మదుపరులు బంగారం, వెండి వైపు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు అంటున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో రికార్డులు
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ధరలు రికార్డు స్థాయిని తాకాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,16,400గా, కిలో వెండి రూ.1.59 లక్షలుగా నమోదయ్యాయి. విశాఖపట్నంలో గత వారం కిలో వెండి రూ.1.59 లక్షలకు చేరింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పరిస్థితి
అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరలు రికార్డులు తిరగరాసాయి. డిసెంబర్ డెలివరీ కోసం ఔన్స్ బంగారం ధర 2% పెరిగి 3,860.45 డాలర్లకు చేరింది. అదే సమయంలో ఔన్స్ వెండి ధర 2% పైగా పెరిగి 47.39 డాలర్లను తాకింది.
ఫ్యూచర్స్ మార్కెట్‌లోనూ రికార్డులు
భారత ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో అక్టోబర్ డెలివరీ బంగారం ధర రూ.1,204 లాభపడి రూ.1,14,992కి చేరింది. డిసెంబర్ కాంట్రాక్ట్ రూ.1,034 పెరిగి రూ.1,15,925కి చేరింది. కేవలం వారం రోజుల్లోనే బంగారం ఫ్యూచర్స్ ధర రూ.4,188 ఎగిసింది. వెండి ఫ్యూచర్స్‌లోనూ భారీ పెరుగుదల కనిపించింది. డిసెంబర్ డెలివరీ కిలో వెండి ధర రూ.2,290 పెరిగి రూ.1,44,179కి చేరగా, మార్చి డెలివరీ కాంట్రాక్ట్ రూ.1,45,817ను తాకింది.
మరింత ముందుకే!
మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం, త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 4,000 డాలర్లకు చేరే అవకాశం ఉంది. ఆ స్థాయికి చేరితే దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం రూ.1.25 లక్షలు, కిలో వెండి రూ.1.75 లక్షలకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వారాంతంలో కొంతమంది మదుపరులు లాభాలు బుక్ చేసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
Also Read : Stock Market Shocking : లాభాల నుంచి నేడు భారీ నష్టాలను చూసిన స్టాక్ మార్కెట్
