అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎఫ్‌సీవీ పొగాకు వేలం ప్రక్రియ గత పది రోజులుగా మెరుగుదల సంకేతాలను చూపుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కొనుగోలుదారుల భాగస్వామ్యం పెరగడం, మార్కెట్‌లో లిక్విడిటీ మెరుగు పడడం, వేలం కేంద్రాల్లో తిరస్కరణలు గణనీయంగా తగ్గడం సానుకూల పరిణామాలని ఆయన పేర్కొన్నారు. పొగాకు కొనుగోళ్ల పరిస్థితిపై సహచర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, ఆనం రామనారాయణరెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అలాగే పొగాకు పండించే జిల్లాల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. జూన్ 11 నాటికి టొబాకో బోర్డు ఆధ్వర్యంలోని వేలం వేదికల ద్వారా మొత్తం 15.65 మిలియన్ కిలోగ్రాముల ఎఫ్‌సీవీ పొగాకు మార్కెటింగ్ జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాలకు ప్రస్తుతం రోజుకు సుమారు 8,000 బేళ్ల పొగాకు వస్తుండటంతో మార్కెటింగ్ ప్రక్రియ సజావుగా సాగడమే కాకుండా కొనుగోలుదారుల పాల్గొనడం కూడా మెరుగు పడిందన్నారు.
ఇటీవలి కాలంలో అత్యంత ముఖ్యమైన పరిణామం తిరస్కరణలు , “నో బిడ్” స్థాయిలు గణనీయంగా తగ్గడమేనని మంత్రి తెలిపారు. గతంలో 30 నుంచి 37 శాతం మధ్య ఉన్న తిరస్కరణల శాతం ప్రస్తుతం సుమారు 20 శాతానికి తగ్గిందని చెప్పారు. ఇది మార్కెట్‌లో పొగాకుకు మెరుగైన ఆదరణ లభిస్తోందనే విషయాన్ని సూచిస్తోందని, అలాగే వ్యాపార అవసరాలకు అనుగుణంగా పొగాకు సరఫరా జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న మార్కెట్ పరిస్థితులపై సమగ్ర అవగాహన కోసం టొబాకో బోర్డు అన్ని వర్గాల భాగస్వాములతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందన్నారు. ఈ నేపథ్యంలో జూన్ 8న వ్యాపార వర్గాలు, ఎగుమతిదారులు, కొనుగోలుదారులు, రైతు ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని మార్కెట్‌లో లిక్విడిటీ పెంచేందుకు ఆచరణాత్మక వ్యూహాలపై చర్చించామని తెలిపారు.
















