డీఎంకేకు షాక్ మాజీ మంత్రి మ‌హేష్ అరెస్ట్

రూ. 100 కోట్ల స్కాంలో కీల‌క‌మైన నిందితుడు

hellotelugu-AnbilMahesh

చెన్నై : ప్ర‌తిప‌క్ష పార్టీ డీఎంకేకు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అన్సిల్ మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయ‌న రూ. 100 కోట్ల స్కాంలో కీల‌క‌మైన నిందితుడిగా ఉన్నాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ప్రైవేట్ పాఠశాలల కుంభకోణంలో మాజీ డీఎంకే మంత్రి అన్బిల్ మహేష్ ను అరెస్టు చేసిన‌ట్లు పోలీసులు అధికారికంగా ప్ర‌క‌టించారు. పాఠశాల విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో (2021-26) ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు , ఇతర పరిపాలనా అనుమతులు ఇచ్చేందుకు గాను సుమారు 1,000కు పైగా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల నుంచి “పార్టీ నిధి” పేరుతో ఆయన డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఆయ‌న త‌న‌ను అరెస్ట్ చేయవ‌ద్దంటూ మ‌ద్రాసు హైకోర్టును ఆశ్ర‌యించారు .

ఇదిలా ఉండ‌గా విచార‌ణ చేప‌ట్టిన మద్రాసు హైకోర్టు అన్సిల్ మ‌హేష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఆ కొద్ది సేపటికే చెన్నై పోలీసుల సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు , చట్టబద్ధమైన అనుమతులు మంజూరు చేయడంలో జరిగినట్లుగా భావిస్తున్న ఈ కుంభకోణానికి సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ‘అవినీతి నిరోధక చట్టం’ కింద అభియోగాలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలను దర్యాప్తు చేసేందుకు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా ‘మనీ లాండరింగ్ నిరోధక చట్టం’ కింద కేసు నమోదు చేసింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై డీఎంకే పార్టీ అధినేత‌, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ , ప్ర‌స్తుత ప్ర‌తిపక్ష నేత ఉద‌య‌నిధి స్టాలిన్ స్పందించేందుకు నిరాక‌రించారు.

Exit mobile version