హైదరాబాద్ : హైదరాబాద్‌లోని డెక్కన్ కిచెన్ రెస్టారెంట్‌కు సంబంధించిన ఆస్తి వివాదంలో నటులు రానా దగ్గుబాటి, వెంకటేష్ దగ్గుబాటి, నిర్మాత డి. సురేష్ బాబు, డి. అభిరామ్, అకౌంటెంట్ గడ్డం విశ్వనాథంలపై జరుగుతున్న క్రిమినల్ విచారణలో జోక్యం చేసుకోవడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. సివిల్ విచారణ ద్వారా పరిష్కరించబడుతున్న వివాదం ఉన్నంత మాత్రాన, క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని అర్థం కాదని కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఫిర్యాదులో క్రిమినల్ నేరానికి సంబంధించిన ఆరోపణలు ఉంటే, సంబంధిత సివిల్ వివాదం విడిగా కొనసాగుతున్నప్పటికీ, క్రిమినల్ కేసును కూడా కొనసాగించవచ్చు అని స్పష్టం చేసింది హైకోర్టు.
ఈ కేసు ‘డెక్కన్ కిచెన్’ రెస్టారెంట్‌కు సంబంధించిన ఫిల్మ్ నగర్‌లోని ఒక ఆస్తికి సంబంధించినది. వ్యాపారవేత్త కోరె నందు కుమార్ ఈ బృందంపై ఆరోపణలు చేస్తూ మేజిస్ట్రేట్ ముందు ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదులో ఆస్తిలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించడం, చోరీ , బెదిరింపులు, నేరపూరిత కుట్రకు తెర లేపారని ఆరోపించారు . అంతే కాకుండా వీరితో పాటు జీహెచ్ఎంసీ అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. లీజుకు తీసుకున్న ఆస్తిలోని నిర్మాణాలను కూల్చివేశారని, చట్టపరమైన ప్రక్రియను పాటించకుండానే ఆవరణలోకి ప్రవేశించారని కుమార్ ఆరోపించారు. అలాగే ఆస్తి నుండి వస్తువులను తీసుకెళ్లారని తనను , తన కుటుంబాన్ని బెదిరించారని ఆయన పేర్కొన్నారు.
ఆస్తి స్వాధీనానికి సంబంధించి కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్న సమయంలోనే ఈ సంఘటనలు జరిగాయని ఫిర్యాదుదారు వాదించారు. తన వాదనకు మద్దతుగా,ఆయన పత్రాలు, ఛాయాచిత్రాలు, వీడియో ఫుటేజ్, సాక్షుల వాంగ్మూలాలు, సివిల్ వ్యాజ్యానికి సంబంధించిన రికార్డులతో సహా అనేక ఆధారాలను మేజిస్ట్రేట్ ముందు ఉంచారు. ఫిర్యాదును స్వీకరించి, నిందితులకు సమన్లు జారీ చేయాలని మేజిస్ట్రేట్ నిర్ణయించిన తర్వాత, నిందితులు 2024లో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ వివాదం ప్రాథమికంగా ఆస్తి ,లీజుకు సంబంధించిన వ్యవహారమని వారి ప్రధాన వాదన. ఈ వివాదాన్ని సివిల్ విచారణ ద్వారా పరిష్కరించుకోవాలని, క్రిమినల్ కేసును కొనసాగించడం సముచితం కాదని వారు వాదించారు. వివాదం సివిల్ స్వభావం కలిగి ఉన్నంత మాత్రాన క్రిమినల్ విచారణను నిలిపివేయాలన్న వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు.
















