శ్రీవారి సన్నిధిలో సేవ చేయడం పూర్వజన్మ సుకృతం

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ముద్దాడ రవిచంద్ర

hellotelugu-TTDEO

తిరుపతి : శ్రీవారి సన్నిధిలో భక్తులకు సేవ చేసే అదృష్టం లభించడం పూర్వజన్మ సుకృతమని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన 28 మంది, అలాగే ఈ ఏడాది జనవరి 1 నుంచి మే 31 వరకు పదవీ విరమణ పొందిన 132 మంది ఉద్యోగులు కలిపి మొత్తం 160 మందికి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల సేవలో ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ అంకితభావంతో పనిచేసిన ఉద్యోగుల సేవలు టీటీడీ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచి పోతాయని కొనియాడారు. ఉద్యోగ జీవితంలో సంపాదించిన అనుభవాన్ని, విలువైన జ్ఞానాన్ని భావితర ఉద్యోగులతో పంచుకుని వారికి మార్గదర్శకులుగా నిలవాలని సూచించారు.

ఉద్యోగ విరమణ అనంతరం అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, కుటుంబ సభ్యులతో సుఖ శాంతులతో జీవించాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వారిపై ఉండాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులను గౌరవించే ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని ప్ర‌క‌టించారు. అంతకు ముందు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే అవకాశం దక్కడం మహాభాగ్యమని, పదవీ విరమణ ఉద్యోగులను ఘనంగా సత్కరించడం భావితర ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. అనంతరం ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవోలు కలిసి పదవీ విరమణ పొందిన సత్యనారాయణ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో పార్వతి సహా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులను శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సన్మానించారు. అనంతరం వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు శ్రీవారి లడ్డు ప్రసాదం, వడ, జాకెట్ పీస్, తీర్థం, మహా ప్రసాదం అందించి, శ్రీవారి శాలువాతో సత్కరించారు.

Exit mobile version