ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ పేలవమైన పర్ ఫర్మాన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ క్రికెటర్ అజింక్యా రహానే. ప్రతి క్రికెటర్ కు ఇలాంటి ఇబ్బంది ఏర్పడుతుందని పేర్కొన్నాడు. ఈసమయంలో తనకు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, కోచ్ గంభీర్ లు మద్దతు ఇవ్వాలని సూచించాడు. తనకు అద్బుతమైన క్రికెటర్ అని, కానీ టైమింగ్ ఒక్కటే కుదరడం లేదన్నాడు. అజింక్యా రహానే ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశాడు. ప్రధానంగా అభిషేక్ శర్మతో తనను పోల్చ వద్దని సూచించాడు. ఎందుకంటే ఇద్దరి ఆటతీరు భిన్నంగా ఉంటుందన్నాడు. మైదానంలోకి దిగిన వెంటనే దూకుడు ప్రదర్శించడం అభిషేక్ శర్మకు అలవాటేనని పేర్కొన్నాడు రహానే.
కానీ సంజూ శాంసన్ అలా కాదని చెప్పాడు. ఎందుకంటే తను కొట్టే షాట్స్ ఇతర ఆటగాళ్లకంటే భిన్నంగా ఉంటాయన్నాడు. తను సిక్స్ లు చాలా అలవోకగా కొడతాడని, కానీ కొద్దిసేపు మైదానంలో గనుక ఉంటే సీన్ వేరేగా ఉంటుందన్నాడు అజింక్యా రహానే. ఏ ఒక్క ఆటగాడికైనా కనీసం 10 మ్యాచ్ లు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. అప్పుడే అసలైన ఆట అనేది బయటకు వస్తుందన్నాడు. లేక పోతే తీవ్రమైన ఒత్తిళ్లకు గురవుతారని పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా అజింక్యా రహానే తాజాగా చేసిన కామెంట్స్ క్రికెట్ వర్గాలలో కలకలం రేపుతున్నాయి.



















