ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య ప్ర‌దాయ‌ని ‘సంజీవ‌ని’ : సీఎం

వైద్య సేవ‌ల‌ను నిరంత‌రం అందుబాటులోకి

hellotelugu-APCM

చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆరోగ్య ప్ర‌దాయ‌ని సంజీవ‌ని కార్య‌క్ర‌మం అని చెప్పారు. శ‌నివారం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలం కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు . అత్యుత్తమ వైద్య సేవలను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చేలా ఈ సంజీవని కార్యక్రమం చేపట్టాం అన్నారు. రామ రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడి ఆరోగ్యాన్ని కాపాడేందుకు హనుమంతుడు తెచ్చిన ఔషధి సంజీవని అని చెప్పారు. అందుకే ఆ సంజీవని పేరిట డిజిటల్ హెల్త్ రికార్డులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆలోచన చేశాం అన్నారు సీఎం. సంపద కంటే ఆరోగ్యం ఉన్న వాళ్లే ఆదృష్టవంతులు అని పేర్కొన్నారు. అందుకే ప్ర‌తి ఒక్క‌రు త‌మ ఆరోగ్యంపై దృష్టి పెట్టాల‌న్నారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలున్నారని గుర్తు చేశారు.

సమాజం బాగుండాలంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అందుకే ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ అనే విధానంలో సంజీవని ప్రారంభించడం జ‌రిగింద‌ని వెల్ల‌డించారు నారా చంద్ర‌బాబు నాయుడు. వ్యాధులు రాకముందే హెచ్చరించి దానికి అనుగుణంగా చికిత్సలు అందేలా చేయటమే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. జూలైలో కుప్పంలో సంజీవని ప్రాజెక్టును పైలట్ గా ప్రారంభించి మార్చి 15 నుంచి చిత్తూరు జిల్లాలో చేపట్టాం అని తెలిపారు. జిల్లాలోని 19.75 లక్షల మంది ఆరోగ్యాన్ని కాపాడేలా ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింద‌న్నారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టును ప్రారంభించాలని నిర్ణయించాం అని ప్ర‌క‌టించారు సీఎం. 42 వైద్య పరీక్షలను ఇంటి వద్దే నిర్వహించి రిపోర్టులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింద‌న్నారు.

ఆరోగ్యానికి అవసరమైన ప్రతీ అంశాన్ని సంజీవని ప్రాజక్టు ద్వారా పర్యవేక్షిస్తాం అన్నారు. డాక్టర్ అప్పాయింట్ మెంట్, వర్చువల్ కనెక్ట్ ద్వారా వైద్య సలహాలు, సంజీవని కార్డు ద్వారా డిజిటల్ హెల్త్ రికార్డుల పర్యవేక్షణ చేస్తున్నాం అన్నారు. వ్యక్తిగత ఆరోగ్య రికార్డులన్నీ డిజిటల్ గా మార్చి పర్యవేక్షణ చేస్తున్నాం అని తెలిపారు సీఎం. త్వరలోనే ఏఐ డాక్టర్ ద్వారా వైద్యసేవలు పొందేలా చర్యలు చేపడుతున్నాం అన్నారు.

Exit mobile version