అమరావతి : వైద్యారోగ్య సేవలు మరింత మెరుగ్గా అందించేందుకు చేపట్టిన ‘సంజీవని ప్రాజెక్టు’ను జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిజిటల్ హెల్త్ రికార్డులతో సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే వైద్య సేవల్లో అనూహ్య మార్పులు సాధించ వచ్చన్నారు. వైద్య సేవల్లో ఏపీని ఇతర రాష్ట్రాలు అనుసరించేలా ‘సంజీవని ప్రాజెక్టును విజయవంతం చేయాలని సీఎం కోరారు. క్యాంపు కార్యాలయంలో ‘సంజీవని ప్రాజెక్ట్’పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లాల్లో ఇప్పటికే సంజీవని ప్రాజెక్ట్ అమలుతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయని, వీటిని రాష్ట్రమంతటా అమలు చేసేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో ప్రతీ కుటుంబం విద్యకు, వైద్యానికే అత్యధికంగా ఖర్చు పెట్టాల్సి వస్తోందని చెప్పారు సీఎం. ఈ వ్యయాన్ని తగ్గించేలా చూసేందుకు సంజీవని వంటి కార్యక్రమాలను తీసుకువస్తున్నట్టు వెల్లడించారు. సంజీవని ప్రాజెక్టులో అధికారిక భాగస్వామిగా ఉన్న టాటా ఎండీ సంస్థ వైద్యారోగ్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. సంజీవని కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించేందుకు 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేసినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. బేస్‌లైన్ అధ్యయనం, డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటు, శిక్షణ, సర్టిఫికేషన్, జాతీయ, రాష్ట్ర పోర్టల్స్‌తో ఇంటిగ్రేషన్ వంటి చర్యలు 90 రోజుల ప్రణాళికలో ఉన్నాయని వెల్లడించారు. 28 జిల్లాల్లో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు.
















