చెన్నై : భారత జట్టు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భారత జట్టు హెడ్ కోచ్ గంభీర్ ను, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ను ఏకి పారేశారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరి ప్రయోజనాల కోసం కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను పక్కన పెట్టారంటూ సూటిగా ప్రశ్నించారు. ఓ ఛానల్ తో తను చిట్ చాట్ చేశాడు. ఈ సందర్బంగా టి20 ఫార్మాట్ కు సంబంధించి ఆసక్తికరమైన గణాంకాలను పంచుకున్నాడు. ఈ ఫార్మాట్ లో ఇప్పటి వరకు 31 మ్యాచ్ లు ఆడిన శుభ్ మన్ గిల్ స్ట్రైక్ రేట్ దారుణంగా ఉందన్నాడు. తను చేసిన పరుగులు కేవలం 285 మాత్రమేనని పేర్కొన్నాడు. ఇదే క్రమంలో సంజూ శాంసన్ తనకంటే ముందంజలో ఉన్నాడని తెలిపాడు. తన స్ట్రైక్ రేట్ ఏకంగా 190కి పైగా ఉందన్నాడు.
వరుసగా ఫెయిల్ అయినా ఎందుకని శుభ్ మన్ గిల్ ను కంటిన్యూగా ఆడిస్తున్నారంటూ నిలదీశాడు. ఒక రకంగా చీవాట్లు పెట్టాడు. నిన్న సౌతాఫ్రికాతో ధర్మశాలలో జరిగిన మ్యాచ్ లో కావాలని గిల్ ను ఆడించారని , అతి తక్కువ స్కోర్ ను ఛేదించడంలో కూడా తను పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డాడని ఎద్దేవా చేశాడు రవిచంద్రన్ అశ్విన్. ఇకనైనా మీ ఫేవరిటిజమ్ పక్కన పెట్టాలని సూచించాడు. లేక పోతే క్రికెట్ అభిమానుల దృష్టిలో మీకున్న విలువను మీరు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. మీ ఒంటెద్దు పోకడ కారణంగా శాంసన్ క్రికెట్ కెరీర్ ను నాశనం చేస్తున్నారంటూ వాపోయాడు.



















