ముంబై : దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన చిత్రం అఖండ -2 తాండవం సీక్వెల్ దుమ్ము రేపుతోంది. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సనాతన ధర్మానికి మద్దతు తెలిపేలా ఉందంటూ పెద్ద ఎత్తున ప్రశంసలు కురుస్తున్నాయి. ఇందులో కీలక పాత్ర పోషించారు హిందూపురం ఎమ్మెల్యే , నటుడు నందమూరి బాలకృష్ణ. ఇందులో విశ్వ రూపం ప్రదర్శించారు. రెండు రోజుల్లోనే అఖండ -2 దూసుకు పోతోంది వసూళ్ల పరంగా. ఏకంగా రూ. 50 కోట్లు దాటేసినట్లు సమాచారం. తొలి రోజున రూ. 28 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాల అంచనా. ఇదిలా ఉండగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ సైతం అఖండ -2 మూవీని తన ట్యాబ్ లో వీక్షించారు. పూర్తిగా మూవీని చూసిన ఆయన ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఈ సందర్బంగా దర్శకుడు బోయపాటి శ్రీనును పిలిపించి ప్రశంసలు కురిపించారు. అద్బుతంగా తీశావంటూ కితాబు ఇచ్చారు. భవిష్యత్తులో విలువలతో కూడిన, సమాజానికి సానుకూల దిశానిర్దేశం చేసే మరిన్ని సినిమాలు వస్తాయని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు . నేటి తరానికి దేశం, మతం , విశ్వాసం వంటి శాశ్వత భారతీయ విలువలను అర్థవంతంగా, ప్రభావవంతంగా తెలియజేసేలా ప్రయత్నం చేసినందుకు, అఖండ -2 తో మెప్పించినందుకు దర్శకుడు బోయపాటి, నటుడు బాలయ్యను ప్రశంసించారు. ఇదిలా ఉండగా మోహన్ భగవత్ నుంచి ప్రశంసలు అందుకోవడం పట్ల ఆనందంగా ఉందన్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను.


















