హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విద్యా రంగంపై ఎక్కువగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ‘యంగ్ ఇండియా’ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 105 పాఠశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించింది. 86 పాఠశాలలకు ఇప్పటికే పరిపాలనా పరమైన అనుమతులు లభించాయి. వాటి నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. 78 పాఠశాలలకు టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. అంతే కాకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆదిలాబాద్ , గజ్వేల్ ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తయ్యింది. పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. ముధోల్, బోథ్ , నిర్మల్ ప్రాంతాల్లో టెండర్ల పరిశీలన (మూల్యాంకనం) కొనసాగుతోంది.
సిర్పూర్, కామారెడ్డి , దుబ్బాక ప్రాంతాలకు భూమి కేటాయించారు. వీటి సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలు (DPRs) తయారీ దశలో ఉన్నాయి. శేరిలింగంపల్లిలో భూమిని గుర్తించారు, అలాగే చంద్రాయణగుట్టలో భూమి ఖరారు ప్రక్రియ జరుగుతోంది. 19 పాఠశాలలు తుది పరిపాలనా పరమైన అనుమతుల కోసం వేచి ఉన్నాయి. మిగిలిన 19 పాఠశాలలకు సంబంధించిన అంచనాలు పరిపాలనా పరమైన అనుమతి కోసం సమర్పించబడ్డాయి. వీటిలో కోరుట్ల, జనగాం, హుజురాబాద్, కరీంనగర్, సిరిసిల్ల, అలంపూర్, సిద్దిపేట, నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్, ఎల్బీ నగర్, మహేశ్వరం, సూర్యాపేట, ఉప్పల్, బాల్కొండ, నిజామాబాద్, కూకట్పల్లి, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్ ప్రాంతాలు ఉన్నాయి.
అనుమతులు లభించిన తర్వాత ఈ 19 పాఠశాలలకు టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఇప్పటివరకు ₹1,144.85 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి క్యాంపస్ 25 నుండి 30 ఎకరాల విస్తీర్ణంలో, 5.36 లక్షల చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో ఉంటుంది. ఒక్కో పాఠశాలలో సుమారు 2,650 మంది విద్యార్థుల సామర్థ్యం ఉంటుంది.
















