అమరావతి : రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా కేంద్ర కార్యదర్శి ఉమా శంకర్ తో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్దికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి, విస్తరణ పనులు, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధి పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి కోరారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. జాతీయ రహదారుల పనుల పెండింగ్ సమస్యలైన భూసేకరణ, అటవీ క్లియరెన్స్, రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తూ జాతీయ ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహకరిస్తున్నామని తెలిపారు.
నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో 2 లేన్ల రహదారిని రూ. 60 కోట్లతో 4 లేన్లుగా మార్చే ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నూతన ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ సమస్యల పరిష్కారంపై కేంద్ర సెక్రటరీ సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. అదే సమయంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన జాతీయ రహదారి ప్రాజెక్టుల మంజూరు, అమలును వేగవంతం చేయాలని కోరారు. NH-165 లో ఆకివీడు నుండి దిగమర్రు వరకు ఫోర్-లేనింగ్ పనులు చేపట్టాన్నారు. NH-216 లో కిమీ 32 నుండి అమలాపురం – రావులపాలెం వరకు ఫోర్-లేనింగ్ పనులు, పెడన నుండి లక్ష్మీపురం వరకు అభివృద్ధి పనులు, NH-365 BB లో కిమీ 26 నుండి 45 వరకు పేవ్డ్ షోల్డర్లతో టూ-లేన్‌గా అభివృద్ధి చేయాలన్నారు.
అదే విధంగా NH-42 లో ముదిగుబ్బ నుండి కదిరి వరకు ఫోర్-లేనింగ్ పనులు , NH-716 లో మద్దనూరు నుండి కడప వరకు ఫోర్-లేనింగ్ పనులు , NH-40 లో కడప – రాయచోటి విభాగంలో ఫోర్-లేన్ టన్నెల్ నిర్మాణంతో పాటు చిత్తూరు పట్టణ పరిధిలో బైపాస్ రహదారి అభివృద్ధి చేపట్టాలని కోరారు మంత్రి. NH-544D లో బుగ్గ నుండి కైప వరకు రహదారి అభివృద్ధి / అప్‌గ్రడేషన్ పనులతో పాటు NH-167K లో నల్లకాలువ నుండి వెలుగోడు వరకు అప్‌గ్రడేషన్ పనులు చేపట్టాలని బీసీ జనార్దన్ రెడ్డి కోరారు.
