ఆస్ట్రేలియా : ఆసిస్ మాజీ కెప్టెన్ , ఐపీఎల్ టీం కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను భారత జట్టు గెలుచుకుంది. విశ్వ విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 96 పరుగుల భారీ తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. గతంలో పొట్టి ఫార్మాట్ లో నెలకొన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టింది టీం ఇండియా. ప్రధానంగా భారత జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ సెన్సేషన్ గా మారాడు. తను ఒక్కడే కేవలం 5 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడాడు. మొత్తం 321 పరుగులు సాధించాడు. నమీబియాతో 22 రన్స్ , జింబాబ్వేతో 24, వెస్టిండీస్ తో 97 , ఇంగ్లండ్ తో 89 , న్యూజిలాండ్ తో 89 పరుగుగలతో సత్తా చాటాడు. అరుదైన ఘనతను సాధించాడు.
అంతే కాదు ఇప్పటి వరకు వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లు విరాట్ కోహ్లీ, షాహిన్ అఫ్రిది రికార్డులను బద్దలు కొట్టాడు సంజు శాంసన్. దీంతో టి20 వరల్డ్ కప్ లో హీరోగా మారాడు. దేశ వ్యాప్తంగా సంచలనంగా నిలిచాడు. తను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బంగా రికీ పాంటింగ్ సంజు శాంసన్ ఆట తీరు గురించి తాజాగా స్పందించాడు. ఇది నిజానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం అన్నాడు. ఇషాన్ కిషన్‌ను బ్యాటింగ్ క్రమంలో కిందికి పంపి, సంజు శాంసన్‌ను తిరిగి ఓపెనింగ్ స్థానానికి తీసుకు రావడం. ఇది ఒక కీలకమైన నిర్ణయం, కానీ అంతిమంగా ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు పాంటింగ్.
గత రెండు వారాలుగా భారత శిబిరం లోపల సరిగ్గా ఏం జరిగిందో నాకు కచ్చితంగా తెలియదు గానీ, బయటి నుంచి చూస్తున్నప్పుడు మాత్రం పరిస్థితి కచ్చితంగా అలాగే కనిపించిందన్నాడు. ఈ టోర్నమెంట్‌ను గెలవాలంటే, సంజు ఓపెనింగ్ స్థానంలో ఉండి, తన అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శిస్తూ, పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడటం అత్యవసరం అని భావించారని, ఈ ప్లాన్ వర్కవుట్ అయ్యిందన్నారు.


















