హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి జిల్లాల పునర్విభజన పేరుతో మరో కుట్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్,తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేయడమే తను కంకణం కట్టుకున్నాడని, అందులో భాగంగానే ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు .దేశ వ్యాప్తంగా జనగణన ప్రారంభం అయిందని, .దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు జిల్లాల, మండలాల సరిహద్దులు మార్చకూడదని అన్నారు. అయినా పనిగట్టుకుని పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టడం పట్ల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుదీర్ఘకాలంగా జిల్లాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మేరకు కేసీఆర్ జిల్లాలు ఏర్పాటు చేశారని చెప్పారు.
ప్రభుత్వం అందుబాటులో ఉండాలని 33 జిల్లాలకు ఏర్పాటు చేసి రెవిన్యూ డివిజన్లు, మండలాలను పెంచారని అన్నారు పల్లె రవికుమార్ గౌడ్. వీళ్ళ ఆధిపత్యం కోసం మళ్లీ పరిపాలన కేంద్రీకరణ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. సమైక్య పాలనలో ఒక్క రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారని, దానికి జిల్లా కేంద్రం లేదని అన్నారు. కేసీఆర్ కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి కొత్త పరిపాలన భవనాలు నిర్మించారని పేర్కొన్నారు. ఏమైనా లోపాలు ఉంటే ప్రజల డిమాండ్స్ ను నెరవేర్చాలని అన్నారు. తెలంగాణ వ్యతిరేక శక్తుల కార్యాచరణ లాగా రేవంత్ రెడ్డి వైఖరి ఉందంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
