వికారాబాద్ జిల్లా : మహనీయుల పోరాటం వల్లనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు లభించాయని అన్నారు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు లభించడం మామూలు విషయం కాదన్నారు. ఎన్నో ఏళ్ల పాటు కోట్లాది మంది బాధితులు, అణగారిన వర్గాలు తమ హక్కుల కోసం పోరాడటం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. సామాజిక న్యాయం లేకుండా ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదు అని అంబేద్కర్ చెప్పిన మాట మనం అందరం గుర్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దేశంలో సామాజిక న్యాయం, పేదల సంక్షేమం, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు.
భూ సంస్కరణలు, అట్రాసిటీ వ్యతిరేక చట్టం, విద్యా హక్కు, సమాచార హక్కు, ఉపాధి హామీ చట్టం వంటి కీలక చట్టాలు తీసుకు వచ్చిన ఘనత తమ పార్టీకే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ నాయకత్వంలో తెలంగాణలో సుమారు 25 లక్షల ఎకరాలు భూమి పేదలకు పంపిణీ చేశామన్నారు దామోదర రాజ నరసింహ.పేదలకు ఇళ్లు, ఇంటి స్థలాలు అందించి గౌరవప్రద జీవనం కల్పించామన్నారు.ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చాం అన్నారు. అంబేద్కర్ కృషితో ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యాయని పేర్కొన్నారు మంత్రి. కానీ, రిజర్వేషన్లతో అన్ని వర్గాలు సమానంగా ప్రయోజనం పొందలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
