కందుల కొనుగోలు గడువు మే 4 వరకు పొడిగింపు

ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

hellotelugu-Atchannaidu

అమరావతి : ఏపీ స‌ర్కార్ తీపి క‌బురు చెప్పింది. రాష్ట్రంలో కందుల‌ను పండించిన రైతుల‌ను ఆదుకునేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు రాష్ట్రంలో కందుల కొనుగోలుకు సంబంధించి గడువు మే 4 వరకు పొడిగించడం జ‌రిగింద‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్ల‌డించారు. ఖరీఫ్ 2025-26 సీజన్‌కు సంబంధించి కందులు (రెడ్ గ్రామ్/తూర్) కొనుగోలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించిన‌ట్లు తెలిపారు. రైతులకు ఎంతో ఊరటనిచ్చే నిర్ణయం అని అన్నారు. రాష్ట్రంలో ధర మద్దతు పథకం (PSS) కింద కొనుగోలు కొనసాగుతుందని మంత్రి స్ప‌ష్టం చేశారు.

ఇవాళ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. కందుల కొనుగోలు గడువును పొడిగించాల‌ని రాష్ట్ర‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశార‌న్నారు. ఆయ‌న చేసిన‌ విజ్ఞప్తిని ప‌రిశీలించిన‌ కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ, మే 4 వరకు పొడిగింపునకు ఆమోదం తెలిపిందన్నారు మంత్రి. రైతులు తమ పంటను నష్ట పోకుండా విక్రయించుకునేలా చూడటం కూట‌మి ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. రైతు పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందేలా ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు అని అన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తోందని తెలిపారు. పంటల కొనుగోలు, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వంటి అన్ని అంశాల్లో రైతులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తాము అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

Exit mobile version