తిరుమల : ఈసారి రికార్డు స్థాయిలో వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకున్నారని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. PAC-1, 2, 3, 4, 5 లో గతంలో ఎన్నడూ లేని విధంగా చేసిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఈవో మీడియాతో మాట్లాడారు. నూతనంగా నిర్మించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన PAC-5 భవనం అందుబాటులోకి రావడంతో భక్తులకు విరివిగా వసతి సదుపాయం కల్పించామన్నారు. సామాన్య భక్తులకు అత్యధిక సంఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉంచడంతో సౌకర్యవంతంగా గదులు పొందారని చెప్పారు. తొలి మూడు రోజులు టోకెన్ కలిగిన భక్తులకే దర్శనం కల్పించడం జరిగిందన్నారు. దీని కారణంగా ఎలాంటి అసౌకర్యం లేకుండా గదులు పొందారన్నారు. ఇక ఉద్యనవనం విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన శ్రీరంగనాధ స్వామి ఆలయ సెట్టింగ్ భక్తులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పారు ఈవో.
శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల ఫలాలు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్ తో ఏర్పాటు చేసిన అలంకరణలు వైకుంఠాన్ని తలపించాయని భక్తులు ఆనందం వ్యక్తం చేశారని తెలిపారు. ఈ పది రోజుల్లో 2.06 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు వెల్లడించారు. తలనీలాల సమర్పణకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో కంటే ప్రస్తుతం తలనీలాల సమర్పణ సులువుగా సౌకర్యవంతంగా ఉందని చాలా మంది భక్తులు తెలియ చేసినట్లు చెప్పారు. దర్శన క్యూ లైన్లు, రోడ్లు, మరుగుదొడ్ల వద్ద భక్తులకు ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారన్నారు. దర్శన క్యూలైన్లు, రద్దీ ప్రాంతాల్లో భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్స్ తో తాగు నీరు పంపిణీ చేశామన్నారు. 24 గంటలు దర్శన క్యూ లైన్లు, నారాయణగిరి షెడ్లలో అందుబాటులో ఉంచిన మొబైల్ డిస్పెన్సరీల ద్వారా అవసరమైన భక్తులకు వైద్యం అందించినట్లు తెలిపారు.


















