అమరావతి : జాతీయ పునరుత్పాదక ఇంధన లక్ష్యంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ను రెన్యువబుల్ ఎనర్జీ కేంద్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ – 2024ని ప్రకటించి, అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రాయలసీమను రెన్యువబుల్ ఎనర్జీ హబ్ గా మార్చేందుకు గత రెండేళ్లుగా విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే రాయలసీమలో రెన్యూపవర్, SAEL మెగా సోలార్ వంటి భారీ ప్రాజెక్టులను ప్రారంభించిన మంత్రి లోకేష్ 30న గురువారం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమి పూజ చేయబోతున్నారు. టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ ఆధ్వర్యాన రూ.5,350కోట్లతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఏర్పాటు చేయబోయే 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పత్తికొండలో మంత్రి లోకేష్ శంకుస్థాపన చేస్తారు.
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో రెండు పెద్ద పునరుత్పాదక (రెన్యూవబుల్) ప్రాజెక్టులను అభివృద్ధి చేయబోతోంది. వీటి మొత్తం సామర్థ్యం 800 మెగావాట్లు. ఇందులో 400 MW విండ్ (కనేకల్లు, ఆనంతపురం), 400 MW సౌరశక్తి (పత్తికొండ, కర్నూలు) ప్రాజెక్టులు ఉన్నాయి. రాష్ట్రానికి పెద్దఎత్తున వస్తున్న భారీపరిశ్రమలకు అవసరమైన పునరుత్పాదక ఇంధన అవసరాలను తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో యుటిలిటీలు, డిస్కమ్స్, వాణిజ్య-పరిశ్రమలు (C&I), ఇతర విభాగాలకు అధిక-నాణ్యత గల రెన్యువబుల్ ఎనర్జీ డిమాండ్‌ను తీర్చేందుకు ఈ ప్రాజెక్టులు ఉపకరిస్తాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో 2,700 ఎకరాల్లో రూ.2,250కోట్లతో సోలార్, అనంతపురం జిల్లా కనేకల్లులో 760 ఎకరాల్లో రూ.3,500కోట్లతో విండ్ ప్రాజెక్టులను టాటా పవర్ ఎనర్జీ సంస్థ అభివృద్ధి చేయబోతోంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణ దశలో సుమారు 4 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
ఈ ప్రాజెక్టు ఆనంతపురం II, కర్నూల్-4 CTUIL సబ్‌స్టేషన్‌లలో 800 MW ఇంటర్-స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ISTS) కనెక్టివిటీని సాధించింది. దీంతో జాతీయ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ ద్వారా పునరుత్పాదక విద్యుత్ సమర్థవంతమైన ఎవాక్యుయేషన్ సాధ్యమవుతుంది. 1100 కి పైగా వ్యవసాయ కుటుంబాలకు ప్రయోజనం కలిగించడమేగాక దీర్ఘకాలిక ఆర్థిక భద్రత, స్థిర ఆదాయాన్ని కల్పిస్తుంది. అనంతపురం జిల్లా కనేకల్లు విండ్ ప్రాజెక్టును సుజలాన్ సంస్థ సాంకేతిక సహకారంతో టాటాపవర్ రెన్యువబుల్ ఎనర్జీ అభివృద్ధి చేయనుంది. రాష్ట్రంలో 160 గిగావాట్ల క్లీన్ ఎనర్జీ సాధించాలన్న కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ ఆశయానికి టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఊతమివ్వనుంది.

















