గుజరాత్ : ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య మంత్రిగా ఉన్న రివాబా జడేజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తన భర్త గురించి, ఇతర క్రికెటర్ల గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి రాజకీయ, క్రికెట్ వర్గాలలో. ఆమె తను కేబినెట్ లో కీలకమైన మంత్రిగా ఉన్నానన్న సోయి లేకుండా కామెంట్స్ చేయడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజు రోజుకు పాలిటిక్స్, క్రికెట్ రెండూ కలిసి పోవడం వల్లనే ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలు లేక పోలేదు. ఇక తాజాగా రివాబా జడేజా తన భర్త గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. అదేమిటంటే తన భర్త క్రికెటర్ కావడంతో తనకు ఎక్కువగా స్వేచ్ఛ ఉంటోందన్నారు రివాబా జడేజా.
తన భర్త రవీంద్ర జడేజా క్రికెట్ ఆడటానికి ఎక్కువగా టైం కేటాయిస్తాడని చెప్పారు. ఇదే సమయంలో ఆటలో భాగంగా లండన్, దుబాయ్ , ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలకు ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. అయినప్పటికీ, ఈ రోజు వరకు అతను ఎలాంటి చెడు అలవాట్లకు బానిస కాలేదని అన్నారు రివాబా జడేజా. ఎందుకంటే అతను తన బాధ్యతలను అర్థం చేసుకుంటాడని కితాబు ఇచ్చారు. మరో వైపు జట్టులోని మిగతా వారందరూ చెడు అలవాట్లకు పాల్పడతారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కానీ వారి కుటుంబాల నుండి ఎలాంటి ఆంక్షలు లేవంటూ పేర్కొన్నారు. కానీ తన ఫ్యామిలీ పరంగా చూస్తే విపరీతమైన ఆంక్షలు ఉంటాయని వాపోయింది రివాబా జడేజా.


















