చెన్నై : భారత క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డేల భవిష్యత్తు గురించి నాకు ఖచ్చితంగా తెలియదని పేర్కొన్నారు. విజయ్ హజారే ట్రోఫీలో కోహ్లీ , రోహిత్ పాల్గొనడం చాలా సంచలనం సృష్టించినప్పటికీ, టి 20 లీగ్‌ల విస్తరణ అనేది భారీ ప్రభావం పడుతుందని అన్నాడు ఆర్. అశ్విన్. ఇదే సమయంలో టెస్టులు సైతం ఐదు రోజులు జరగాల్సి ఉండగా కేవలం రెండు మూడు రోజుల్లోనే ముగుస్తుండడం కొంచెం ఇబ్బంది కలిగించే అంశమన్నారు. దీన్ని బట్టి చూస్తే 50 ఓవర్ల ఫార్మాట్ కోసం స్థలం దొరకక పోవచ్చని అనుమానం వ్యక్తం చేశాడు.
ప్రధానంగా నిర్వాహకులు సైతం క్రికెట్ ఫ్యాన్స్ స్పీడ్ గా ముగిసే మ్యాచ్ లకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారని తెలిపాడు. దీని కారణంగా రాబోయే రోజుల్లో ఇక టెస్టు మ్యాచ్ లు, వన్డే మ్యాచ్ లకు ఆదరణ తగ్గే ప్రమాదం లేక పోలేదని పేర్కొన్నాడు. ఒక రకంగా మారుతున్న అభిరుచులకు అనుగుణంగా బీసీసీఐ కూడా సర్వే చేయాల్సిన అవసరం ఉందన్నాడు. ఇందులో భాగంగా ఫార్మాట్ లు మరింత జనాదరణ పొందేలా చూడాలని పేర్కొన్నాడు రవిచంద్రన్ అశ్విన్. ఒకప్పుడు వన్డే ఫార్మాట్ పాపులర్ గా ఉండేది. ఆ సమయంలోనే చాలా మంది క్రికెటర్ లు వెలుగులోకి వచ్చారు. ఎప్పుడైతే టి20 ఫార్మాట్ వచ్చిందో ఇక అన్ని ఫార్మాట్ లు ప్రమాదంలో పడ్డాయని పేర్కొన్నాడు.



















