హైదరాబాద్ : నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందిన ప్రముఖ బహు భాషా నటి రష్మిక మందన్నా సంచలనంగా మారారు. తను ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవితం ఆధారంగా రూపొందుతున్న బయోపిక్ లో నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో మరోసారి వార్తల్లో నిలిచింది మందన్నా. భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన, భారతరత్న పురస్కార గ్రహీత ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జీవిత ప్రస్థానం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
తాజా సమాచారం ప్రకారం ఈ దిగ్గజ గాయని పాత్రను పోషించడానికి రష్మిక మందన్నను ఖరారు చేశారు. వాస్తవానికి ఈ పాత్ర కోసం మొదట సాయి పల్లవిని పరిశీలించినప్పటికీ, ఇతర ప్రాజెక్టుల కారణంగా ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ఈ ప్రధాన పాత్ర కోసం రుక్మిణి వసంత్‌ను కూడా పరిశీలిస్తున్నట్లు గతంలో ఊహాగానాలు వచ్చాయి. అయితే ప్రస్తుతం అందిన విశ్వసనీయమైన నివేదికల ప్రకారం, చిత్ర బృందం ఇప్పుడు ఈ సవాలుతో కూడిన పాత్ర కోసం రష్మికను ఎంపిక చేసింది.
ఎం.ఎస్. సుబ్బులక్ష్మి వ్యక్తిత్వం, హుందాతనం, ఆమె సంగీత వారసత్వాన్ని తెరపై ఆవిష్కరించే బాధ్యత రష్మికపై ఉంటుంది. ఈ పాత్ర నటిగా ఆమెకు ఒక పెద్ద సవాలుగా మారడంతో పాటు, ఆమె కెరీర్లోనే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేష్, అల్లు అరవింద్ , బన్నీ వాసు నిర్మిస్తుండగా, గౌతమ్ తిన్ననూరి దీనికి దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. ఎం.ఎస్. సుబ్బులక్ష్మి జయంతి అయిన సెప్టెంబర్ 16న చిత్ర బృందం ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఆ ప్రకటన సమయంలోనే సినిమా టైటిల్, నటీనటులు , సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తారని టాక్.



















