ముంబై : బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ , అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించిన చిత్రం పెద్ది. ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. సంగీత శిఖరంగా భావించే అల్లా రఖా రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ ఇచ్చాడు. తాను స్వర పర్చిన చికిరి చికిరి సాంగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. పెద్ది సినిమా డిజిటల్ రైట్స్ ను స్వంతం చేసుకునేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయి. చివరకు నెట్ ఫ్లిక్స్ రామ్ చరణ్ మూవీ రైట్స్ ను కైవసం చేసుకున్నట్లు ప్రకటించింది. శనివారం ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించింది. పెద్ది చిత్రం వచ్చే మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దం కానుంది.
ప్రస్తుతం నిర్మాణ పనులు పూర్తి వేగంతో జరుగుతున్నాయి. థియేటర్లలో విడుదలైన తర్వాత ‘పెద్ది’ తమ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమ్ అవుతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఎక్స్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెద్ది కేవలం ఒక క్రీడాకారుడి కథ మాత్రమే కాదు, వెనుకబడిన వారి కథ కూడా అని స్పష్టం చేసింది. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో అందుబాటులో ఉంటుందని తెలిపింది.. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీగా రూ. 105 కోట్లకు కొనుగోలు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, ఇతరులు సహనటులుగా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ ఆధారిత రొమాంటిక్ యాక్షన్ డ్రామా కోసం అంతా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
