అమరావతి : ప్రజా భద్రతే ప్రగతికి పునాది అని తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మంగళవారం మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్స్ లో నూతనంగా ఎంపికైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 5500 మంది పోలీసు కుటుంబంలో అడుగు పెడుతున్న వారందరికీ స్వాగతం పలుకుతున్నాం అన్నారు. ప్రజా భద్రతే ప్రగతికి పునాది అనే విశ్వసించే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విజిబిల్ పోలీసింగ్- ఇన్విజిబుల్ పోలీస్ అనే విధానంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ అభ్యర్ధులందరిదీ నాలుగేళ్ల కల అని అన్నారు. నిలిచి పోయిన ప్రక్రియను నాలుగు నెలల్లోనే పూర్తి చేసి నియామక పత్రాలు ఇస్తున్నామని ప్రకటించారు.
పోలీసు వ్యవస్థకు- తెలుగుదేశం పార్టీకి అవినాభావ సంబంధం ఉందని అన్నారు వంగలపూడి అనిత. పోలీసు అకాడమీని ఏపీలో తొలిసారిగా ఏర్పాటు చేసింది టీడీపీనేనని చెప్పారు. డీఎస్సీ లాగే ఎస్సై, పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ జరిపిన ఘనత తమ సర్కార్ దేనని పేర్కొన్నారు. 23 వేల మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. 6100 పోస్టుల రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇస్తే 5 లక్షల మంది అప్లై చేశారని వెల్లడించారు. సీఎంగా చంద్రబాబు ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ లోనే తాను టీచర్ గా ఎంపికై ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఆయన కేబినెట్ లో హోం మంత్రిని అయ్యాననని చెప్పారు.

















