న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ సీరియస్ అయ్యారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై మండిపడ్డారు. గతంలో తమ హయాంలో రూపొందించిన పథకాలకు పెట్టిన పేర్లను మార్చడం పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ హయాంలో పేదలు, కూలీలకు మెరుగైన భద్రతతో కూడిన ఉపాధి కల్పించేందుకు గాను మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) ను తీసుకు వచ్చారు. ఈ ఒక్క స్కీం కారణంగా కోట్లాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా చేసింది. ఈ సందర్బంగా ఈ పథకం స్థానంలో కొత్త స్కీం తీసుకు రావడంపై నిలదీశారు సోమవారం లోక్ సభలో. ఏం తప్పు చేశారని మహాత్మా గాంధీ పేరును తొలగించాలని అనుకుంటున్నారంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)’ పేరుతో బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రియాంక గాంధీ. ఒక పథకం పేరు మార్చినప్పుడల్లా కార్యాలయాల్లో, స్టేషనరీలో చాలా మార్పులు చేయాల్సి ఉంటుందన్నారు. దీని కోసం డబ్బు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి, ఎందుకు ఇలా చేస్తున్నారంటూ నిలదీశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని . భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడైన మహాత్మా గాంధీ పేరును తొలగించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ఆమె ప్రశ్నించారు.
















