తిరుమల : ఏపీ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఈసారి ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనాల కోసం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాదిలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈసారి ప్రతి భక్తుడికి స్వామి వారి దర్శన భాగ్యం సులభంగా కలిగేలా చూస్తున్నామని తెలిపారు. మొత్తం 10 రోజులు కేటాయించడం జరిగిందని చెప్పారు ఆనం రామ నారాయణ రెడ్డి. ఇందుకు గాను 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించామని స్పష్టం చేశారు. ఈ–డిప్ లో టోకెన్లు పొందిన భక్తులందరూ నిర్దేశిత సమయంలోనే తిరుమలకు చేరుకోవాలని కోరారు. లేకపోతే ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.
నిరంతరం ఏఐ టెక్నాలజీతో క్యూలైన్లను పర్యవేక్షించడం జరుగుతుందని చెప్పారు మంత్రి. వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై మంత్రివర్గ ఉప సంఘం సమీక్ష చేపట్టింది. ఈ సమావేశంలో మంత్రులు అనగాని సత్య ప్రసాద్, ఆనం రామ నారాయణ రెడ్డి, వంగలపూడి అనితతో పాటు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ , అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు ఆనం రామ నారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామన్యులకే పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు.



















