న్యూఢిల్లీ : ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. వికసిత్ భారత్ కోసం 7 అంశాలతో కూడిన సప్త ధార విధానం ప్రకటించారు. ‘సప్త ధార’లో మొదటి శక్తి ‘తయారీ రంగ సామర్థ్యం’ అని మోదీ పేర్కొన్నారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే దిశగా ప్రయాణాన్ని వేగవంతం చేసే లక్ష్యంతో, ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఏడు అంశాలతో కూడిన ‘సప్త ధార’ సంస్కరణల విధానాన్ని ప్రకటించారు. తయారీ రంగం, వ్యవసాయ-ఆహార ఉత్పత్తి, ఆహార శుద్ధి, సాంకేతికత ,ఆవిష్కరణలు, లాజిస్టిక్స్, రక్షణ రంగం, హరిత , నీలి ఆర్థిక వ్యవస్థ , అలాగే సాంస్కృతిక/ప్రభావశీల శక్తి వంటి అంశాలపై ఇందులో దృష్టి సారించారు. ఒకప్పుడు ఏడు నదుల ద్వారా భారతదేశ శక్తి ప్రపంచానికి తెలిసిందని మోదీ గుర్తుచేశారు. ఇప్పుడు అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడానికి దేశానికి కొత్త శక్తి వనరులు అవసరమని ఆయన అన్నారు.
అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడానికి మనకు ఒక కొత్త శక్తి ప్రవాహం అవసరం అని ఆయన పేర్కొన్నారు. ఈ రోజు, ఎర్రకోట ప్రాకారం నుండి, దేశం ముందు ఆ ఏడు శక్తి వనరులను నేను ఆవిష్కరిస్తున్నాను అని మోదీ అన్నారు. రాబోయే 5-7 ఏళ్లలో, ఈ ఏడు శక్తి వనరుల సామర్థ్యంతో దేశాన్ని కొత్త శిఖరాలకు చేర్చుతామన్నారు. కొత్త ఊపును ఇస్తామని, కొత్త లక్ష్యాన్ని సాధించే సామర్థ్యాన్ని కల్పిస్తామని ప్రధాని మోదీ చెప్పారు. దేశ నిర్మాణంలో యువశక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకుంటామని కూడా తెలిపారు. సప్త ధారలో మొదటి శక్తి తయారీ రంగ సామర్థ్యమని మోదీ పేర్కొంటూ, తయారీ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని, అలాగే చిన్న విడిభాగాల నుండి భారీ ఉత్పత్తుల వరకు అన్నింటినీ తయారు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
డిజైన్ నుండి తయారీ వరకు, ప్రపంచానికి నమ్మదగిన గ్లోబల్ సప్లై చైన్ భాగస్వామిగా భారతదేశం తనను తాను నిలబెట్టుకోవాలి అని ఆయన అన్నారు. ఖర్చు, నాణ్యత , ఉత్పత్తి పరిమాణం విషయంలో మనం ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకోవాలని పీఎం స్పష్టం చేశారు. కర్మాగారాలు పోటీతత్వంతో ఉండాలని, ఉత్పత్తులు వినియోగదారులకు అనుకూలంగా ఉండాలని , ప్యాకేజింగ్ ఆకర్షణీయంగా ఉండాలని ఆయన అన్నారు. వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్ ఈ విషయంలో భారతీయ రైతులు ప్రపంచ మార్కెట్లను అందుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
