తిరుమల : శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి, ఇతర పదార్థాల కల్తీ నివారణకు తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. కల్తీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని అధికారులను ప్రశ్నించారు. 2024 నవంబరులో NDDB సంస్థ విరాళంగా అందించిన ఆధునిక GC/HPLC యంత్రాల ద్వారా నెయ్యి స్వచ్ఛతను అత్యంత శాస్త్రీయంగా ఇక్కడే నిర్ధారించవచ్చని అధికారులు వెల్లడించారు. 2025 జూలై నుంచి నెయ్యి నాణ్యతపై విస్తృత స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనివల్ల కల్తీకి ఏమాత్రం అవకాశం ఉండదని ముఖ్యమంత్రికి వివరించారు. ముడి పదార్థాల్లో ఉండగలిగే పురుగు మందుల అవశేషాలు, యాంటీ బయోటిక్స్, లెడ్, ఆర్సినిక్ వంటి హెవీ మెటల్స్ కనుగొనే సామర్థ్యం ఉన్న పరికరాలను కూడా ఈ ల్యాబులో ఏర్పాటు చేశామన్నారు.
బ్యాక్టీరియా గుర్తింపు కోసం ప్రత్యేకంగా క్లీన్ రూమ్, ఎయిర్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వంటి భద్రతా ప్రమాణాలను చూసి ముఖ్యమంత్రి అభినందించారు. శ్రీవారి ప్రసాదాల పట్ల భక్తులకు ఉన్న అపారమైన నమ్మకాన్ని కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యంగా అధికారులు పని చేయాలని స్పష్టం చేశారు. కేవలం ల్యాబ్ పరీక్షలకే పరిమితం కాకుండా, అన్నప్రసాద కేంద్రాల్లోని వంటశాలల శుభ్రతపై నిరంతర తనిఖీలు నిర్వహించి పరిశుభ్రతను నిర్ధారించాలని ఆదేశించారు. టీటీడీ తీసుకున్న ఈ చర్యలు శ్రీవారి ప్రసాదాల పట్ల మరింత నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. భక్తుల ఆరోగ్య రక్షణకు మాత్రమే కాకుండా, తిరుమలలో చేపట్టిన ఫుడ్ సేఫ్టీ చర్యలు దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తాయని ముఖ్యమంత్రి కొనియాడారు.



















