తిరుపతి : టీటీడీ స్థానిక ఆలయాల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి ఆభరణాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమల శ్రీవారి ఆలయం నుండి రూ.33 లక్షల విలువైన స్వర్ణాభరణాలను బహుకరించారు. ఈ ఆభరణాలలో శీమ కమలాలు, నవరత్న పూసలతో కూడిన రెండు పేటల బంగారు హారం, బంగారు లక్ష్మీకాసుల మాల ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆలయం తరఫున ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం ఈ ఆభరణాలను నారాయణవనం ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నకు అందజేశారు.
అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఆభరణాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకువెళ్లి, మూలమూర్తి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారికి అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, తిరుమల బొక్కసం ఇన్‌చార్జి శ్రీ గురురాజస్వామి, సూపరింటెండెంట్ శ్రీ శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, చెంగల్‌రాయులు, ఆలయ అర్చకులు, అధికారులు, శ్రీవారి సేవకులు , పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) విస్తృతంగా ఏర్పాట్లు చేసింది.
