ఒంటిమిట్ట రాములోరి క‌ళ్యాణానికి త‌లంబ్రాలు

కోదండ రాముల వారి సేవ‌లో శ్రీ‌వారి సేవ‌కులు

hellotelugu-TTDTalambralu

తిరుపతి / ఒంటిమిట్ట : శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో శుక్ర‌వారం తలంబ్రాల ప్యాకింగ్‌ను టీటీడీ శాస్త్రోక్తంగా ప్రారంభించింది.శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోజు జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో ఎంతో ప్రాముఖ్య‌త ఉన్న ముత్యాల‌ త‌లంబ్రాల ప్యాకింగ్ కార్య‌క్ర‌మం శ్రీవారి సేవకులతో ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణవేదిక వద్ద గల పిఏసి వద్దకు తీసుకొచ్చారు. శ్రీ సీతా రామ కళ్యాణం కోసం తలంబ్రాల తయారీకి అవసరమయ్యే పసుపు వినియోగించేందుకు మార్చి 25న‌ పుసుపు దంచే కార్యక్రమం నిర్వ‌హించారు.

ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నారు. తలంబ్రాలతో పాటు ముత్యం, కంకణం ఉంచి 1.60 ల‌క్ష‌ల ప్యాకెట్లను సిద్ధం చేస్తున్నారు. క‌డ‌ప‌, అన్న‌మ‌య్య జిల్లాల నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో సేవ‌లు అందించేందుకు దాదాపు 600 మంది శ్రీవారి సేవకులు తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌తి ఏటా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున ఒంటిమిట్ట కోదండ రామ‌స్వామి క‌ళ్యాణోత్స‌వానికి సీఎం దంప‌తులు ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు ప్రశాంతి, శివ‌ప్ర‌సాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version