హైదరాబాద్ : మాజీ మంత్రి హరీష్ రావు బాంబు పేల్చారు. ఆయన భారీ భూ స్కాంను బయట పెట్టారు. ఆదివారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. నాదర్ గుల్ భూముల కబ్జా వెనుక రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్షా రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా బయట పెట్టారు. దమ్ముంటే సీఎం దీనిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. 373 ఎకరాల నిషేధిత భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి, “This Land belongs to MEIL & Shilpa Infra” అని బోర్డు పెట్టారని అన్నారు. ఈ కంపెనీ భాజాప్తా మంత్రి కొడుకు హర్షా రెడ్డిదేనని పేర్కొన్నారు హరీష్ రావు.
తాము అసెంబ్లీలో మైనింగ్ స్కామ్ తీయగానే ఆ బోర్డు తీసేసారని మండిపడ్డారు. శిల్పా ఇన్ ఫ్రా కంపెనీకి పొంగులేటి హర్షా రెడ్డి, పొంగులేటి లోహిత్ రెడ్డి, పొంగులేటి స్వప్న రెడ్డి డైరెక్టర్లుగా ఉన్నారని చెప్పారు .అంటే ఈ భూముల వెనుక పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని స్పష్టంగా అర్థమైందన్నారు. రెవెన్యూ మంత్రే కుంభకోణాలు చేస్తుంటే, పాపం ఆర్డీవో ఏం చేస్తాడని ప్రశ్నించారు. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై నిప్పులు చెరిగారు హరీష్ రావు. నువ్వు వెళ్తావా నన్ను వెళ్ళమంటావా? అని నిలదీశారు. పేదోళ్ల ఇండ్లు కూలుస్తావు కానీ ఈ కబ్జాదారుల కుట్రలు కనిపిస్తలేవా రంగనాథ్ అని ప్రశ్నించారు. ఈ 373 ఎకరాల భూమిలో లచ్చమ్మకుంట అనే కుంట ఉందని, ఇది 23 ఎకరాల చెరువు, దీని కింద 150 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఇప్పుడు ఈ కబ్జాదారులు లచ్చమ్మకుంట ఫీడర్ ఛానెల్స్ బంజేసి మరీ కబ్జా చేస్తున్నారని ఆరోపించారు.
