అమరావతి : పోలవరం ప్రాజెక్టును ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని. స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. హోటల్స్, షాపింగ్ ఏరియా ఉండాలని సీఎం అన్నారు. ప్రాజెక్టు సమీప ప్రాంతాల సుందరీకరణకు సంబంధించిన డిజైన్లను బుధవారం జరిగిన సమీక్షలో పరిశీలించారు. పోలవరం-పాపికొండలు-భద్రాచలం వరకు బోటింగ్ సౌకర్యం కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వాటర్, రాక్, ఫారెస్ట్, స్పోర్ట్స్ థీమ్‌తో పర్యాటకుల్ని ఆకట్టుకోవాలని సూచించారు. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించేలా పనుల్లో వేగం పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులో భాగమైన ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1, 2 పనులను వచ్చే ఏడాది మార్చి లోగా పూర్తి చేయాలని నిర్దేశించారు.
ట్విన్ టన్నెల్స్ లైనింగ్ పనులు 77 శాతం, అప్రోచ్ చానల్ ఎర్త్ వర్క్ పనులు 98 శాతం, హెడ్ రెగ్యులేటర్ కాంక్రీట్ పనులు 71 శాతం, ఇరిగేషన్ టన్నెల్ తవ్వకాలు పూర్తి అయ్యాయని, లైనింగ్ 76 శాతం పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు . కేఎల్ బండ్ ఎర్త్ వర్క్, ఎంబార్క్‌మెంట్ రెండూ 89 శాతం మేర పూర్తి అయ్యిందని, ఏడాది జూన్ కల్లా అన్ని పనులు పూర్తి చేస్తామని వివరించారు. ఆర్ అండ్ ఆర్ కి సంబంధించి 95 కాలనీలకు గాను 26 పూర్తి అయ్యాయని, మిగిలిన వాటిలో 49 కాలనీలు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి, మరో 20 కాలనీలు 2027 ఏప్రిల్ నాటికి పూర్తి కానున్నాయని చెప్పారు. తొలిదశలో 38,060 నిర్వాసిత కుటుంబాలకు గాను, ఇప్పటి వరకు 16,763 కుటుంబాలను తరలించినట్టు వివరించారు. ఈ ఏడాది ఆగస్ట్ నాటికి 8,518 కుటుంబాలు, 2027 మార్చి నాటికి 12,779 కుటుంబాల తరలింపు పూర్తి కావాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.27,089 కోట్లు వ్యయం కాగా, మరో రూ.5,108 కోట్లతో సివిల్, ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి కానున్నాయని తెలిపారు.