PM Modi : దేశంలో సెమీకండక్టర్ రంగ అభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమి ప్రాంగణంలో సెమికాన్ ఇండియా–2025 సదస్సును ప్రారంభించనున్నారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ అంతర్జాతీయ సమావేశంలో ఆయన బుధవారం కూడా పాల్గొని, సీఈఓ రౌండ్‌టేబుల్ సమావేశంలో హాజరవుతారు.
PM Modi – అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రతిస్పందన
48 దేశాల నుండి వచ్చిన 2,500 ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తం మీద 20,750 మందికి పైగా ఈ సదస్సుకు హాజరుకానుండగా, 50కి పైగా గ్లోబల్ లీడర్లు, 150కి పైగా నిపుణ వక్తలు, 350 మందికి పైగా ప్రదర్శనకారులు కూడా ఉంటారు. అదనంగా ఆరు దేశాల రౌండ్‌టేబుల్ చర్చలు, శ్రామిక శక్తి అభివృద్ధిపై ప్రత్యేక సెషన్లు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పావిలియన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ప్రధాన అంశాలు
ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకటన ప్రకారం, ఈ సదస్సులో కింది అంశాలపై చర్చ జరుగనుంది:
- సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ పురోగతి
- ఫ్యాబ్, అధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు
- స్మార్ట్ తయారీ, మౌలిక సదుపాయాలు
- కృత్రిమ మేధస్సు (AI), పరిశోధన–ఆవిష్కరణ
- డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (DLI) పథకం అమలు
- స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు
- రాష్ట్ర స్థాయి విధానాలు, అంతర్జాతీయ సహకారం
మోదీ దార్శనికత
సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతికత అభివృద్ధి కోసం భారతదేశాన్ని ప్రపంచ కేంద్రంగా నిలపడం ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యం. ఈ క్రమంలోనే 2022లో బెంగళూరులో, 2023లో గాంధీనగర్‌లో, 2024లో గ్రేటర్ నోయిడాలో సెమికాన్ ఇండియా సదస్సులు నిర్వహించబడ్డాయి.
భారత్–జపాన్ భాగస్వామ్యం
ప్రధానమంత్రి మోదీ (PM Modi) ఇటీవల జపాన్ పర్యటనలో 21 ఒప్పందాలు కుదిరాయి. వీటిలో సెమీకండక్టర్‌లు, కృత్రిమ మేధస్సు రంగాల్లో సహకారం ప్రధానమైంది. ఈ సందర్బంగా మోదీ టోక్యో ఎలక్ట్రాన్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను సందర్శించారు. అధునాతన సాంకేతికతలో భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. జపాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశానికి బదిలీ చేయడం ద్వారా చైనాపై ఆధారపడటం తగ్గించవచ్చని, ఆర్థిక భద్రత పెంపొందుతుందని అంచనా.
సెమికాన్ ఇండియా–2025 ద్వారా, భారత్‌లో దృఢమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ నిర్మాణానికి మార్గం సుగమం కానుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు కొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా.
Also Read : Nestle CEO Shocking : కింది స్థాయి ఉద్యోగి తో అక్రమ సంబంధం పెట్టుకున్న నెస్లే సిఈఓ నిష్క్రమణ



















