90 రోజుల్లో శాశ్వ‌త నీటి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

నిర్వాసితుల‌కు అండ‌గా ఉంటామ‌న్న అచ్చెన్నాయుడు

hellotelugu-Atchannaidu

శ్రీ‌కాకుళం జిల్లా : మూలాపేట పోర్టు నిర్వాసితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సోమ‌వారం శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలం నౌపాడ ఆర్ , ఆర్ కాలనీలో “నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీల్లో పర్యటించి మూలపేట పోర్టు నిర్వాసితుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ప్రస్తుతం కాలనీలో తీవ్రంగా ఉన్న తాగునీటి సమస్యపై అధికారులతో మాట్లాడారు. రాబోయే 90 రోజుల్లోగా శాశ్వత తాగునీటి సౌకర్యం పూర్తి చేయాలని ఆదేశించారు అచ్చెన్నాయుడు. దేవునల్తాడ నుండి పైపుల ద్వారా వంశధార నీటిని అందించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వం మూలపేట నిర్వాసితులను నిర్లక్ష్యం చేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు.

నీటి భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. భూమిలో నీరు ఉంటే అది రిజర్వ్ బ్యాంక్ లాంటిది అని అన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని భూగర్భ జలాలు పెంచేలా చెరువులు నింపడం, ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌ల పునరుద్ధరణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 60 వేల నీటి సంఘాలు రాబోయే 100 రోజుల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పనిచేసి భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేయాలన్నారు.

శ్రీకాకుళం జిల్లా ప్రయోజనాల విషయంలో మన ప్రభుత్వం ఎప్పుడూ రాజీ పడదు. 30 ఏళ్ల నేరడి బ్యారేజ్ వివాదంపై ప్రభుత్వం 18 నెలలు కోర్టులో గట్టిగా పోరాడి ట్రిబ్యునల్ గ్రీన్ సిగ్నల్ సాధించడం మన జిల్లాకు దక్కిన చారిత్రాత్మక విజయం అని అన్నారు. నేరడి బ్యారేజ్ నిర్మాణం పూర్తైతే లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం చాలా వరకు తగ్గుతుంద‌ని చెప్పారు అచ్చెన్నాయుడు.

గత పాలకులు వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్లో భారీ అవినీతికి పాల్పడటమే కాకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పనులను నిలిపి వేశార‌ని ఆరోపించారు. ఇప్పుడు ఆ బిల్లులను క్లియర్ చేసి పనులను తిరిగి ప్రారంభిస్తున్నాం అని చెప్పారు. రైతులకు సాగునీరు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరా కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం అన్నారు.

Exit mobile version