అమరావతి : జల సంరక్షణ అనేది మనకు ఒక సవాల్ గా మారబోతోందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామీణ ప్రాంతాల్లో లభ్యమయ్యే నీటి సంరక్షణ చర్యలు, వృథా అయ్యే నీటిని కాపాడుకునే చర్యలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్తు తరాలకు మనం భరోసానిచ్చినట్లు అవుతుందని అన్నారు.ప్రతి కుటుంబానికీ తగినంత తాగు నీరు అందించాలనే ఆశయానికి క్షేత్రస్థాయిలో ఎన్నో అవరోధాలు ఉన్నాయన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తగినంతగా ఉపరితలంలో లభించే నీరు లభ్యత లేకపోవడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం కీలకమైన సమస్యలుగా ఉన్నాయని వాపోయారు. లభ్యతగా ఉన్న నీరు కూడా ఎక్కువగా కాలుష్యం బారిన పడుతోందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరి శిఖర గ్రామాల్లో వేసవిలో నీటి సమస్యను తీర్చేందుకు వాటర్ షెడ్ల పునరుద్ధరణకు ప్రణాళికలు వేస్తున్నాం అన్నారు. మారుతున్న సాంకేతికను ఎప్పటికప్పుడు వినియోగించుకొని నీటి కొరత తీర్చేందుకు, నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నాం అని చెప్పారు.
ముఖ్యంగా నీటి సంరక్షణ చర్యల్లో ప్రజల భాగస్వామ్యం అవసరం అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ప్రతి కుటుంబానికి తగినంత తాగునీరు అందించాలనే బృహత్ సంకల్పంతో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టిన నరేంద్ర మోదీ ఆశయానికి అనుగుణంగా ముందుకు వెళ్తాం అని చెప్పారు. కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ సీఆర్ పాటిల్ , సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకంలో నీటి పొదుపు చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. జల్ జీవన్ మిషన్ 2.0 కార్యక్రమంలో భాగంగా నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. నీటిని జాగ్రత్తగా వినియోగించుకునేలా, వృథా నీటిని పునర్వినియోగించుకునేలా ప్రజల్లో అవగాహన తీసుకు రావడం ప్రధానం అన్నారు.
