అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని అన్నారు. రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు.
సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో గిరి ప్రదక్షణ రోడ్డును నిర్మించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి , తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయన్నారు. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు అని పేర్కొన్నారు. నాకు గిరి ప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉందన్నారు.


















