అమరావతి : కేంద్రం సహకారం అందించడం వల్ల ప్రజలకు మరింత చేరువయ్యేలా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. డీడీఓ కార్యాలయాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నామన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న అధికారులకు పదోన్నతులు కల్పించామన్నారు. సులభంగా, సత్వరంగా ప్రజలకు సేవలందించేలా ఏర్పాటు చేశామన్నారు. నూతన సంస్కరణలతో సరికొత్తగా బాధ్యతలు చేపట్టాలన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర పంచాయతీలకు సహాయ సహకారాలు అందుతున్నాయని చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల. నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత తీసుకున్నామన్నారు. గురువారం రాష్ట్రంలోని 77 డీడీఓ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు.
రాష్ట్రంలో 70 శాతం గ్రామాలే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రజానీకానికి పాలనా పరంగా సులభంగా, సత్వరంగా సేవలందించాలనేది ప్రధానం అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమంతో పాటు, అభివృద్ధిని గ్రామీణ ప్రజలకు పారదర్శకంగా అందించడానికి డివిజనల్ డెవలప్మెంట్ (డీడీఓ) కార్యాలయాలు వారధిలా పని చేస్తాయని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. పాలనను సులభతరం చేసేలా, క్షేత్రస్థాయిలో వేగంగా కార్యకలాపాలు నిర్వహించేలా ఈ కార్యాలయాలు పని చేస్తాయన్నారు. ఒకేసారి రాష్ట్రంలో 77 డీడీఓ కార్యాలయాలను ప్రారంభించడం శుభ సంకేతమని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేలా, నూతన మార్పులతో జీవో నంబరు 57, 58ను అనుసరించి ముందుకు సాగామన్నారు.















