అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల తన ఉదారతను చాటుకున్నారు. అంధుల మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ జట్టుకు రూ. 84 లక్షల రూపాయల ప్రోత్సాహకంగా ప్రకటించారు. వీటిని తన వ్యక్తిగత సంపాదన నుండి అందిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. ప్రతీ క్రీడాకారిణికి రూ. 5 లక్షల చొప్పుల చెక్కుల అందచేశారు. టీమ్ బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపి నగదు ప్రోత్సాహకం ఇచ్చారు. ప్రతీ ఒక్కరితో స్వయంగా పలకరిస్తూ వారికి సన్మానం చేశారు. వారి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కెప్టెన్ దీపికా తన ఊరికి రోడ్డు మార్గం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పడంతో గంటల వ్యవధిలో మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలోని హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న తంబలహెట్టి రోడ్లను పరిశీలించారు.
హేమావతి నుంచి తంబలహెట్టి వరకూ రోడ్డు నిర్మాణానికి రూ.3.2 కోట్లు, గున్నేహళ్లి నుంచి తంబలహెట్టీ వరకూ 5 కిమీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు అవసరమని అంచనా వ్యయానికి అనుమతులు మంజూరు చేశారు. ఇదిలా ఉండగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ తమను ఆదరించారని, అక్కున చేర్చుకున్నారని, మానసికంగా తమకు మనో బలాన్ని అందించారని ఈ సందర్బంగా అంధుల మహిళా క్రికెటర్లు చెప్పారు. ఆ తర్వాత మీరే తమను గుర్తించి ఆదుకున్నారని ప్రశంసించారు. మీ మేలును ఈ జన్మలో మరిచి పోలేమని పేర్కొన్నారు.



















