జగిత్యాల జిల్లా : తెలంగాణలోని అత్యంత ప్రసిద్ది చెందిన జగిత్యాల జిల్లా లోని పుణ్య క్షేత్రం కొండగట్టులోని ఆంజనేయ స్వామి ఆలయం. గత కొన్నేళ్లుగా ఇక్కడ కొలువుతీరిన స్వామిని దర్శించు కునేందుకు వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. అంజన్న అంటే చచ్చేంత ఇష్టం ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ కు. ఈ సందర్బంగా తాను నమ్మే ఆ దేవుడికి గుర్తుగా వచ్చి పోయే భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు గాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో , టీటీడీ దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడుతో చర్చించి ఆలయానికి రూ. 35.19 కోట్లు మంజూరు చేయయించారు. ఈ సందర్భంగా శనివారం పవన్ కళ్యాణ్ కొండగట్టును సందర్శించారు. ఆంజనేయ స్వామికి పూజలు చేశారు.
అనంతరం ఇక్కడ కొత్తగా నిర్మించే ధర్మశాలకు శంకుస్థాపన చేశారు. భక్తుల వసతి కోసం విరాళాల రూపంలో సమకూరిన నిధులతో నిర్మించనున్నారు. ఇందులో 96 గదుల నిర్మాణం చేపడతారు. ఆంజనేయ భక్తులు దీక్ష విరమణ చేసేందుకు గాను హాల్‌కు భూమి పూజ చేశారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత నాచుపల్లిలోని ఒక రిసార్ట్‌లో జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లి పోయారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.



















