అమ‌రావ‌తి బిల్లు ఆమోదం చారిత్రాత్మ‌కం

మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు కామెంట్

hellotelugu-Atchannaidu

అమ‌రావ‌తి : అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొంద‌డం,, బిల్లును ఏకగ్రీవంగా ఉభయ సభలు ఆమోదించటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. రైతుల త్యాగాలకు న్యాయం జ‌రిగింద‌న్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. చెప్ప‌లేనంత సంతోషంగా ఉంద‌న్నారు. ఒక ర‌కంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇవాళ సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ ద‌గిన రోజుగా ఆయ‌న అభివ‌ర్ణించారు. 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన ప్రజా రాజధాని అమరావతి అని పేర్కొన్నారు. 1600 రోజులు నిరంతర పోరాటం చేసిన రైతులు, మహిళల ఉద్యమానికి సెల్యూట్ చేస్తున్నాన‌ని చెప్పారు.

ఆనాడు మహిళలను అని చూడ‌కుండా జ‌రిగిన దాడులు ఇప్ప‌టికీ మ‌రిచి పోలేద‌న్నారు. 12 ఏళ్లుగా రాజధానిపై అస్పష్టత నెల‌కొంద‌ని, అభివృద్ధి లేక‌, పెట్టుబడులు రాక తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు కింజార‌పు అచ్చెన్నాయుడు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది గ‌త స‌ర్కార్ అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎన్నికల ముందు అమరావ‌తి గురించి మాట్లాడ‌టం, ఆ త‌ర్వాత అధికారంలోకి వచ్చాక మాట తప్పడం ప‌రిపాటిగా మారింద‌న్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని అన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని దిశగా అడుగులు వేస్తుంద‌న్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ సంకల్పంతో వికసిత్ ఆంధ్రప్రదేశ్‌కు బలమైన పునాది ప‌డుతుంద‌న్నారు.

Exit mobile version