Paritala Ravi : పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పరిటాల రవీంద్ర (పరిటాల రవి) తన జీవితాన్ని త్యాగం చేశారని, పేదల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. పేదల కోసం, వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం పరిటాల రవి అహర్నిశలు కృషి చేశారన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి భావితరాలకు తెలియ జేయాలన్న సంకల్పంతో పరిటాల రవి (Paritala Ravi) కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరిటాల రవి జయంతి సందర్భంగా పెనుకొండ పట్టణంలోని దర్గా సర్కిల్ లో ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి సవిత ఏర్పాటు చేసి, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పరిటాల రవి సతీమణి, ఎమ్మెల్యే పరిటాల సునీత, తనయుడు శ్రీరామ్, ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు సురేంద్ర బాబు, ఎమ్మెస్ రాజు పాల్గొన్నారు.
Minister Savitha Key Comments on Paritala Ravi
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి సవిత మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అన్న ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారన్నారు. ఆయన బాటలో నడిచిన పరిటాల రవి పేదల బాగు కోసం తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. వెనుకబడిన అనంతపురం జిల్లా అభివృద్ధి కోసం రవన్న చేసిన సేవలు మరువలేనివన్నారు. పరిటాల రవి బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతిగా చరిత్రలో నిలిచి పోయారన్నారు. పేదల గుండెల్లో రవన్న చిరస్థాయిగా నిలిచి పోయారని కొనియాడారు. సమ సమాజ నిర్మాణం కోసం ఆయన చేసిన సేవలు భావి తరాలకు తెలియ జేయాలన్న సంకల్పంతో పెనుకొండలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆ మహనీయుడి కాంస్య విగ్రహం ఏర్పాటుతో తన జీవితం ధన్యమైందన్నారు. తన కుటుంబానికి, పరిటాల రవి కుటుంబానికి విడదీయలేని బంధం ఉందన్నారు సవిత.
తన రాజకీయ అరంగేట్రం రవన్న సూచన, స్ఫూర్తితోనే జరిగిందన్నారు. పరిటాల రవి చూపిన దారిలోనే ఆయన సతీమణి, ఎమ్మెల్యే సునీత, తనయు శ్రీరామ్ పనిచేస్తూ, పేదల అభ్యున్నతి కోసం రేయింబవళ్లు కృషి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దర్గా సర్కిల్ వరకు సాగింది. జోహర్ రవన్న అంటూ కార్యకర్తల చేసిన నినాదాలతో పెనుకొండ మార్మోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజినప్ప, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి, పలువురు ప్రజా ప్రతినిధులు, పరిటాల రవి అభిమానులు, కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Also Read : Nagarjuna University Exclusive : పబ్లిక్ పాలసీ కోర్సు దరఖాస్తుల గడువు పొడిగింపు

















