హైదరాబాద్ : ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ యోధుడు, ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22 న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు మంత్రి వాకిటి శ్రీహరి ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం నాయకులు సచివాలయం లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించాలని, ఆయన సేవలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా కార్యక్రమాలు చేపట్టాలని వారు ముఖ్యమంత్రిని కోరారు. అదేవిధంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని ప్రస్తుతం ఉన్న బీసీ-డీ కేటగిరీ నుంచి బీసీ-ఏ కేటగిరీలోకి మార్చాలని కూడా ముఖ్యమంత్రికి విన్నవించారు.ముదిరాజ్ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
ముదిరాజ్ సంఘం నాయకుల విజ్ఞప్తులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. పండుగ సాయన్న జయంతి అధికారిక నిర్వహణతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గం బీసీ-ఏ కేటగిరీకి మార్పు అంశాలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని సీఎం హామీ ఇచ్చినట్లు తెలిపారు. ముదిరాజ్ సామాజిక వర్గం అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో పాలమూరు జిల్లా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, పండుగ సాయన్నను వెలుగులోకి తీసుకు వచ్చిన లాయర్ బెక్కం జనార్దన్ , క్రిష్ణ, తదితరులు ఉన్నారు.
















