తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలు ఏప్రిల్ 25 నుండి 27 తేదీ వరకు తిరుమలలో ఘనంగా జరుగనున్నాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్ప స్వామివారు గజ వాహనం, రెండవరోజు అశ్వ వాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి విచ్చేస్తారు. ఆ తరువాత కల్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.
శ్రీ పద్మావతి పరిణయోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 25 నుండి 27వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. పురాణాల ప్రకారం సుమారు ఐదు వేల ఏళ్ల కిందట, అంటే కలియుగం తొలినాళ్లలో సాక్షాత్తు వైకుంఠం నుండి శ్రీమహా విష్ణువు శ్రీ వేంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణ వనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన శ్రీ పద్మావతిని శ్రీవేంకటేశ్వరునికిచ్చి వివాహం చేశారు. ఆకాశరాజు వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుణి నక్షత్రంలో నారాయణవనంలో కన్యాదానం చేసినట్లుగా శ్రీ వేంకటాచల మహాత్మ్యం గ్రంథం తెలుపుతోంది.
ఆనాటి పద్మావతీ శ్రీనివాసుల కల్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ముందు ఒక రోజు, తరువాత ఒక రోజు కలిపి మొత్తం మూడు రోజుల పాటు పద్మావతీ పరిణయోత్సవాన్ని టీటీడీ నిర్వహిస్తోంది. 1992వ సంవత్సరం నుంచి ఈ ఉత్సవం జరుగుతోంది. ఆనాటి నారాయణ వనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతీ పరిణయ వేడుకలు జరగడం విశేషం.
